కారుమూరి సునీల్ అరెస్టుపై రాధాకృష్ణ స్పందన..
తణుకు: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఈడీ, సిట్ దర్యాప్తులో అవినీతి మూలాలు తాడేపల్లి ప్యాలెస్ వైపే ఉన్నాయని, అక్రమ నగదు లావాదేవీలు, మనీలాండరింగ్ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. సిగ్మా లాజిస్టిక్స్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ పేరును దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయని, ఆయన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేశారు. కక్షసాధింపుకోసం ఈడీ, సిట్ వంటి సంస్థలు పనిచేయవని, అంతిమ లబ్ధిదారులు ఎవరో దర్యాప్తు సంస్థలే తేలుస్తాయని పేర్కొన్నారు. ఫ్లెక్సీల తొలగింపుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని సూచిస్తూ, మద్యం కుంభకోణంలో నిజాలు వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
View Latest Deals & Offers
